Home Top Stories సముద్రాలను బయపెడుతున్న ప్లాస్టిక్ భూతం

సముద్రాలను బయపెడుతున్న ప్లాస్టిక్ భూతం

సముద్రాలను బయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
Save Ocean from Plastic

కారణాలు ఏవైనా సముద్రాలు విపరీతమైన కాలుష్యానికి గురవుతున్నాయి. మరీ ముఖ్యంగా సముద్రాలను ప్లాస్టిక్ భూతం భయపెడుతున్నది. ఇష్టారీతిన పారవేస్తున్న ప్లాస్టిక్ కారణంగా సముద్రాల్లోకి చేరి అక్కడి జలచరాలకు జీవన్మరణ సమస్యగా తయారవుతున్నది. ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది
మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ప్రపంచంలోని మహాసముద్రాలకు చేరుకుంటున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు చెప్తున్నాయి. ఈ ప్లాస్టిక్ ఎక్కడ నుండి వస్తుందో మీకు తెలుసా. గాలి, కాలువలు లేదా అక్రమ డంపింగ్
ద్వారా సముద్రాలలో ప్లాస్టిక్ వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. సముద్రాలకు ప్లాస్టిక్ రవాణా అవడంలో నదులే ముఖ్యం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ మహాసముద్రాలలో 90 శాతానికి పైగా ప్లాస్టిక్ పది పెద్ద నదుల నుంచి వస్తున్నది.

రివర్స్ ఇన్ ది సీ రిపోర్ట్ ద్వారా ప్లాస్టిక్ శిథిలాల ఎగుమతి ప్రకారం, ఆసియాలోని కొన్ని కలుషితమైన నదులు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ నివేదిక ప్రకారం, చైనాకు చెందిన చాంగ్ జియాంగ్ లేదా యాంగ్జీ నది ఈ విషయంలో అత్యంత పెద్ద దోషిగా పేర్కొనవచ్చు. ఇది
ఏటా 1.47 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ను సముద్రంలోకి తీసుకువెళ్తుందని గుర్తించారు. ఈ కారణంగా, చైనా మొసళ్ల ఉనికికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, బైజీ నది డాల్ఫిన్ల ఉనికికి కూడా ముప్పు ఏర్పడింది.

చైనా నుంచే అధికం
చైనా, భారతదేశం, పాకిస్తాన్ మీదుగా ప్రవహించే సింధు నది కూడా అత్యంత కలుషితమైన నదిగా పరిగణించబడుతున్నది. ఇది ప్రతి సంవత్సరం 1,64,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాలకు తీసుకెళ్తున్నది. చైనా యొక్క రెండవ అతి పెద్ద యోల్లో రివర్ కూడా చాలా ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి తీసుకువెళ్తున్నది. ఇది ఏటా 1,24,000 ప్లాస్టిక్ వ్యర్థాలను తెస్తుందని గుర్తించారు. ఒక అంతర్జాతీయ నివేదిక ప్రకారం, అమెరికా, జపాన్. అనేక యూరోపియన్ దేశాలు ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తున్నాయి. చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం దేశాలు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి వదులుతున్నాయి.
ఇవి చాలా ప్రమాదకరం
ప్లాస్టిక్ వ్యర్థాలు త్వరగా విచ్చిన్నం కావు. చాలా హానికరమైనవి. ఎప్పటికీ నాశనం కాని కొన్ని ప్లాస్టిక్ రకాలు కూడా ఉన్నాయి. ఇవి చిన్నగా మారుతుండటంతో ఆహారంగా భావించి అనేక సముద్ర జంతువులు, చేపలు తింటున్నాయి. దాంతో తీవ్ర ఆనారోగ్యానికి గురై ప్రాణాలు విడుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చేపలు, ఇతర జలచరాలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకువస్తుండటానికి ఇదే కారణంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సముద్ర జీవుల్లో ప్లాస్టిక్
సముద్ర జంతువుల మాంసం (సీ ఫుడ్) విషయంలో గుల్లలు, నత్తలు, ఇతర జలచరాల్లో మైక్రోప్లాస్టిక్స్ అత్యధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. వివిధ పరిశోధనల ప్రకారం, అత్యధికంగా మైక్రో ప్లాస్టిక్ నత్తలలో గుర్తించారు. ప్రతి రెగ్ కు 10.5 ముక్కలు మైక్రో ప్లాస్టిక్లు ఉన్నాయి. క్రస్టేసియన్ జీవులు అయిన పీతలు, రొయ్యల్లో కూడా మైప్లాస్టిక్స్ గ్రాముకు 0.1 నుంచి 8.6 కణాలు కనుగొన్నారు. చేపల్లో గ్రాముకు 2.9 కణాల వరకు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్శిటీ ఆఫ్ యార్క్ హల్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలలో ఈ సమాచారం బయటపడింది. చైనా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా దేశాల్లో నత్తలు, మస్సెల్స్ అత్యధిక శాతం వినియోగిస్తారని, తర్వాతి స్థానాల్లో యూరప్ దేశాలు, యూకే ఉన్నాయి.
సముద్రంలో కొవిడ్ మాస్కులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల వినియోగం బాగా పెరిగింది. అయితే, ఇదే సమయంలో మాస్కుల కాలుష్యం కూడా పెరిగిపోయింది. 2020 లో సుమారు 1.56 బిలియన్ మాస్టు మహాసముద్రాల్లోకి ప్రవేశించాయని, ఇది 4,680 నుంచి 6,240 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యంతో సమానమని హాంకాంగ్ కు ఓషన్ ఏషియా తెలిపింది. ఈ మాస్కులు నాశనం కావడానికి 450 సంవత్సరాలు పడుతుందని

శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మైక్రో ప్లాస్టిక్ కారణంగా సముద్ర ప్రాణులతోపాటు పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర ప్రభావం ఏర్పాడనున్నదని వారు పేర్కొంటున్నారు. సింగిల్ యూజ్ ఫేస్ మాలు వివిధ రకాల మెల్ట్ బ్లోన్
ప్లాస్టిక్ నుంచి తయారవుతాయి. ఈ మాస్కులు సముద్రాల్లో చెత్తకుప్పలుగా తయారవుతున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే సముద్ర జీవుల ఉనికి ప్రశ్నార్థకంగా తయారవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లోకి తద్వారా సముద్రాల్లోకి రాకుండా ప్రజలు ముఖ్యంగా పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here