
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపుల లోనే
ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి
అల్లన మెల్లన నల్లపిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ…
అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
మోహనమురళీగానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనె చూడాలి